Janasena: పొత్తుల దిశగా చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన నేత నాదెండ్ల స్పందన ఇదే
- ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే మా లక్ష్యమన్న నాదెండ్ల
- టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని వ్యాఖ్య
- బీజేపీతో సత్సంబంధాలున్నాయన్న నాదెండ్ల
2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సమష్టి ఉద్యమం జరగాల్సి ఉందని, ఆ ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన చాలా వేగంగానే స్పందించింది. ఈ మేరకు శుక్రవారం కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.
ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఓటు చీలకుండా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే దీనిపై పవన్ కల్యాణ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని నాదెండ్ల చెప్పారు. ప్రస్తుతం బీజేపీతో తమ పార్టీకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని నాదెండ్ల తెలిపారు.