Surname: కొత్తగా పెళ్లయిన యువతులు ఇంటి పేరు మార్చుకోవడాన్ని సులభతరం చేసిన ఏపీ సర్కారు
- పెళ్లి తర్వాత యువతుల ఇంటి పేరు మార్పు
- గతంలో ఇబ్బందికరమైన ప్రక్రియ
- సరళీకృతం చేసిన ఏపీ ప్రభుత్వం
- వేలిముద్రల సేకరణతో వివరాల నమోదు
- అధికారుల ఆమోదంతో ఇంటి పేరు మార్పు
కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత యువతి ఇంటి పేరు మారుతుందని తెలిసిందే. ఆమె పేరు ముందు అత్తారింటి పేరు చేరుతుంది. అయితే, పెళ్లయిన తర్వాత యువతులు సత్వరమే తమ ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు వీలుగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. పెళ్లయిన యువతి అత్తవారింట్లో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకోవడం ఇక సులభతరం కానుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఇంటి పేరు మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
కొత్తగా ఇంటి పేరు మార్చుకోవాల్సిన వారి నుంచి సచివాలయాల్లో వేలిముద్రలు తీసుకుంటారు. ఆ విధంగా నమోదైన వేలిముద్రలకు ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలుపుతారు. ఆమె పేరును రేషన్ కార్డులోనూ చేర్చుతారు. తద్వారా ఆమె ప్రభుత్వ పథకాలకు అర్హురాలవుతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.