Sri Lanka: మరోమారు ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక అధ్యక్షుడు.. గత అర్ధరాత్రి నుంచే అమల్లోకి

Sri Lanka Under State Of Emergency Again Amid Its Worst Economic Crisis

  • నెల రోజుల్లో రెండోసారి ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు
  • 17న పార్లమెంటును ముట్టడిస్తామన్న విద్యార్థులు
  • ఆ లోపే అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్

ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇందుకు కారణమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరోమారు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. గత అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీ వల్ల కారణం చెప్పకుండానే ప్రజలను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు, భద్రతా బలగాలకు లభించింది. 

మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేసేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు, ఈ నెల 17న పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం కానుండగా, అదే రోజు పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ లోపే అధ్యక్షుడు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. కాగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వేలాదిమంది విద్యార్థులు కొలంబోలో పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులను 24 గంటలపాటు దిగ్బంధించారు. 

ఇక, నిన్న ప్రధాని మహిందకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు, ప్రజలు మాత్రమే ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ వస్తుండగా, తాజాగా నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గ సహచరులు కొందరు ఆయన రాజీనామాను డిమాండ్ చేయడం గమనార్హం. కాగా, శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడం నెల రోజుల్లో ఇది రెండోసారి.

  • Loading...

More Telugu News