Cyclone: బంగాళాఖాతంలో ‘అశని’ తుపాను.. ఊహించిన దానికన్నా వేగంగా కదులుతున్న అల్పపీడనం
- 10 నాటికి విశాఖ, ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశం
- వాతావరణ పరిస్థితులతో సముద్రంలోకి ‘యూ టర్న్’ తీసుకునే అవకాశమూ ఉందంటున్న అధికారులు
- దానిపై రేపు స్పష్టత వస్తుందని వివరణ
- గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
బంగాళాఖాతంలో ‘అశని’ తుపానుకు అవకాశాలు బలపడుతున్నాయి. దక్షిణ అండమాన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం.. ఆదివారం ఉదయం నాటికి తుపానుగా మారుతుందని ఇవాళ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నాటికి తీవ్రవాయుగుండంగా అల్పపీడనం బలపడుతుందని చెప్పింది. ఆ తర్వాత 24 గంటలకు బంగాళాఖాతంలో తుపానుగా పరిణామం చెందుతుందని తెలిపింది. ఈ నెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరానికి చేరుతుందని, ఈ నెల 10 లేదా 11న విశాఖపట్టణం, భువనేశ్వర్ మధ్య నేలను తాకుతుందని పేర్కొంది.
కాగా, నిన్న భారత తీర ప్రాంతానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కొనసాగింది. ఇవాళ సాయంత్రం నాటికి దానిపై మరోసారి అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఊహించినదానికన్నా అల్పపీడనం వేగంగా కదులుతోందని అధికారులు చెబుతున్నారు. రేపటికి దాని వేగం 25 నాట్లకు చేరే అవకాశం ఉందని, తుపానుగా మారే నాటికి మే 10న ఆ వేగం 45 నాట్లకు పెరుగుతుందని అంటున్నారు.
అయితే, ఇప్పటికిప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని, జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ తుపాను పర్యవేక్షణ విభాగం ఇన్ చార్జ్ ఆనంద కుమార్ దాస్ చెప్పారు. వివిధ మోడల్స్ వివిధ రకాలుగా సూచిస్తున్నాయని, అంచనాలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం నాటికి దానిపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
తుపాను ఏపీ, ఒడిశా తీరాలను తాకకుంటే.. యూటర్న్ తీసుకుని మళ్లీ సముద్రంలోకే చేరే అవకాశం ఉందని, బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. మే 10న గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, ఈ సారి వచ్చే తుపానుకు శ్రీలంక నామకరణం చేయనుంది. దాని ప్రకారం ‘అశని’ అనే పేరును ఖరారు చేశారు. సింహళ భాషలో అశని అంటే.. కోపం, ఆగ్రహం అని అర్థం.