COVID19: కరోనాకు మొక్కల నుంచి వ్యాక్సిన్.. అన్ని వేరియంట్ల నుంచీ రక్షణ.. ట్రయల్స్ లో మంచి ఫలితాలు

New Plant Based Corona Vaccine Made by Canada Researchers Have Good Results
  • 70 శాతం ప్రభావవంతంగా పనితీరు
  • 24,141 మందిపై పరిశోధనలు
  • రూపొందించిన కెనడా సంస్థ మెడికగో
కరోనాకు కొత్త వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే, అది ఇప్పుడున్న వ్యాక్సిన్లకు భిన్నమైంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లకు బేస్ వైరస్ లోని భాగాలు లేదా పూర్తి వైరస్ తో టీకాలకు రూపునిచ్చారు. అయితే, తొలిసారిగా కెనడా శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి మొక్కల నుంచి వ్యాక్సిన్ ను రూపొందించారు. 

మనుషులపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఆ ఫలితాల్లో కరోనాలోని ఐదు వేరియంట్లకు వ్యాక్సిన్ కళ్లెం వేస్తున్నట్టు తేలింది. 70 శాతం ప్రభావంతో పనిచేస్తున్నట్టు వెల్లడైంది. ఆ వివరాలను వ్యాక్సిన్ ను రూపొందించిన కెనడాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘మెడికగో’ పరిశోధకులు వెల్లడించారు.  

మొక్కల ఆధారంగా తయారు చేసిన కరోనా వైరస్ లాంటి పార్టికల్స్ ను ఏఎస్వో3 అనే రకం సహాయక ఔషధంతో కలిపి వ్యాక్సిన్ ను తయారు చేశారు. 24,141 మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వారిలో కొందరికి వ్యాక్సిన్, మరికొందరికి డమ్మీ వ్యాక్సిన్ (ప్లాసిబో)ను ఇచ్చి టెస్ట్ చేశారు. 

ఫలితాల్లో 70 శాతం ప్రభావాన్ని వ్యాక్సిన్ కనబరిచినా.. గణాంకాల పరంగా మాత్రం 78.8 నుంచి 74 శాతంగా వ్యాక్సిన్ ప్రభావం ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మళ్లీ కరోనా సోకే ప్రమాదం (బ్రేక్ త్రూ కేసులు) కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు. అయితే, 65 ఏళ్లలోపు వారిపైనే ఈ పరిశోధనలు చేశామని, పరిమిత వనరుల నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారిపై పరిశోధనలు చేయలేదని వివరించారు.
COVID19
Vaccine
Corona Virus
Canada

More Telugu News