KTR: రాహుల్ గాంధీ 'పొత్తు' వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చిన కేటీఆర్
- నిన్న వరంగల్ లో కాంగ్రెస్ రైతు సభ
- హాజరైన రాహుల్ గాంధీ
- దోపిడీ దొంగలతో పొత్తు ఉండదని వ్యాఖ్యలు
- పొత్తు కావాలని ఎవరడిగారన్న కేటీఆర్
వరంగల్ లో నిన్న జరిగిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణను దోచుకున్న దొంగలతో తాము పొత్తు పెట్టుకోబోమని, అసలు తమకు ఏ పార్టీతో పొత్తు లేదని రాహుల్ అన్నారు. దీనిపై కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. అసలు, దేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా...? అని వ్యంగ్యం ప్రదర్శించారు.
కాంగ్రెస్ ఒక కాలం చెల్లిన పార్టీ అని, ఇప్పుడా పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అని వ్యాఖ్యానించారు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే, దాన్ని రాహుల్ చదివారని కేటీఆర్ విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని రాహుల్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? కాంగ్రెస్ అంత గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఏఐసీసీకి కొత్త అర్థం చెప్పారు. ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ లో కొత్త అంశాలేవీ లేవని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమకు భూమిపూజ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.