Tajinder Bagga: తాజిందర్ బగ్గాకు అర్ధ రాత్రి ఉపశమనం.. ఇప్పటికైతే అరెస్ట్ లేనట్టే
- అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలంటూ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించిన బగ్గా
- అరెస్టుపై 10వ తేదీ వరకు స్టే
- అప్పటి వరకు పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం
అరెస్ట్ నుంచి బీజేపీ నేత తాజిందర్ బగ్గాకు అర్ధరాత్రి ఉపశమనం లభించింది. మొహాలి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై పంజాబ్ హర్యానా హైకోర్టును తాజిందర్ ఆశ్రయించారు. అర్ధరాత్రి అత్యవసర విచారణకు అనుమతించిన హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు అరెస్ట్‌పై స్టే విధించింది. మే 10న తదుపరి విచారణ జరుగుతుందని, అప్పటి వరకు బగ్గాపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
న్యాయవాది అనిల్ మెహతా దాఖలు చేసిన అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలంటూ తాజిందర్ బగ్గా వేసిన పిటిషన్‌లో.. తనను అరెస్ట్ చేయడమే ప్రాసిక్యూషన్ ఏకైక ఉద్దేశమని అందులో పేర్కొన్నారు. తన స్వేచ్ఛకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ నాయకులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఉందని బగ్గా ఆరోపించారు.
కాగా, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలపై పంజాబ్ పోలీసులు తాజిందర్‌పై కేసు నమోదు చేశారు. మొహాలీకి చెందిన ఆప్ నేత సన్నీ అహ్లూవాలియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 1న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, మార్చి 30న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం వెలుపల బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బగ్గా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
శుక్రవారం బగ్గాను ఢిల్లీలో ఆయన ఇంటి వద్ద పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పంజాబ్ తీసుకెళ్తుండగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఢిల్లీ పోలీసులు బగ్గాను దేశ రాజధానికి తీసుకొచ్చి విడిచిపెట్టిన విషయం తెలిసిందే.