KTR: ఫిలిం యూనివర్సిటీ కావాలన్న టాలీవుడ్ నిర్మాత... స్పందించిన కేటీఆర్

KTR conducts Ask KTR in Twitter

  • సోషల్ మీడియాలో కేటీఆర్ లైవ్ చాట్
  • ఆస్క్ కేటీఆర్ పేరిట ట్విట్టర్ లో ప్రశ్నోత్తరాలు
  • సినీ రంగ అంశాలపై సీఎం కసరత్తులు చేస్తున్నాడన్న కేటీఆర్
  • కేటీఆర్ కు అనేక ప్రశ్నలు సంధించిన కొండా సురేఖ
  • స్పందించిన మంత్రి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వేగంగా స్పందించే కేటీఆర్, అప్పుడప్పుడు ఆస్క్ కేటీఆర్ పేరిట స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. నేడు కూడా ఆయన సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఓ ప్రశ్న అడిగారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని మధుర శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా హైదరాబాద్ ను భారతీయ చిత్ర రంగానికి కేంద్రబిందువుగా మార్చవచ్చని సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని బదులిచ్చారు. కొవిడ్ సంక్షోభం వల్ల తమ ప్రణాళికలు ఆలస్యం అయ్యాయని వివరణ ఇచ్చారు. 

ఇక, తన కుమారుడు హిమాన్షు ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ (సీఏఎస్) ప్రెసిడెంట్ గా ఎన్నికవడం పట్ల కూడా కేటీఆర్ స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఓ తండ్రిగా గర్విస్తున్నానని తెలిపారు. 

అటు, ఆస్క్ కేటీఆర్ లైవ్ చాట్ లో కాంగ్రెస్ నేత కొండా సురేఖ కూడా ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. యాదాద్రి నిర్మాణంలో లోపం ఎవరి తప్పిదం? అని నిలదీశారు. ఇన్నేళ్ల నుంచి మర్చిపోయిన వరంగల్ టెక్స్ టైల్ పార్కుపై ఇంత అర్జెంటుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? అని కూడా కొండా సురేఖ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇవే కాదు, ఇంకా పలు అంశాలపై కొండా సురేఖ సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ ఏ ఒక్కదానికీ బదులివ్వలేదు.

  • Loading...

More Telugu News