Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
- నంద్యాల జిల్లాలో పవన్ పర్యటన
- శిరివెళ్ల మండలం గోవిందపల్లి విచ్చేసిన జనసేనాని
- కౌలు రైతుల కుటుంబాలకు సాయం
- మీడియాతో మాట్లాడిన వైనం
జనసేనాని పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. శిరివెళ్ల మండలం గోవిందపల్లి విచ్చేసిన పవన్ కల్యాణ్ ను మీడియా ప్రతినిధులు టీడీపీతో పొత్తు అవకాశాలపై ప్రశ్నించారు. పొత్తుపై టీడీపీ ఆహ్వానిస్తే ఏమని బదులిస్తారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళతామని చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమం, రాష్ట్ర భవిష్యత్తుకు జనసేన అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
ప్రభుత్వ ఓటు చీలకూడదని భావిస్తున్నట్టు పవన్ కల్యాణ్ గతంలో వ్యాఖ్యానించడంపైనా మీడియా ప్రతినిధులు గుర్తు చేశారు. దీనిపై పవన్ మాట్లాడుతూ, ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాదు, బీజేపీతో తమ భాగస్వామ్యం అమోఘమైన రీతిలో ఉందని తెలిపారు. రోడ్ మ్యాప్ కు సంబంధించిన విషయాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.
కాగా, రైతు కుటుంబాల పరామర్శకు వచ్చిన సందర్భంగా పవన్ చేతికి రెండు ఉంగరాలు దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో, ఏదైనా జ్యోతిష్యానికి సంబంధించిన ఉంగరాలు అయ్యుండొచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు.
.