Asani: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'అసని'

Asani intensified into severe cyclonic storm

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని
  • మరింత బలపడిన తుపాను
  • ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపుగా పయనం
  • పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఐఎండీ తాజా బులెటిన్ విడుదల

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఈ సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది కార్ నికోబార్ దీవికి వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది. 

అసని గత 6 గంటలుగా గంటకు 14 కిమీ వేగంతో కదులుతోందని వివరించింది. ఈ తుపాను ప్రభావంతో మే 10వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మే 11వ తేదీన కూడా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. మే 12న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.

తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అసని ఈ నెల 12వ తేదీ నాటికి వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. అప్పటివరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తాజా బులెటిన్ లో హెచ్చరించింది.

  • Loading...

More Telugu News