Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో ఆలయం గుర్తులను చెరిపేశారన్న లాయర్.. ఇంతకీ, అసలు వివాదం ఏమిటి?
- మసీదు గోడలపై స్వస్తిక్ చిహ్నాలు
- హిందూ దేవతల విగ్రహాల మాదిరి రాళ్లు
- మసీదు లోపల సర్వేకు అనుమతించని నిర్వహణ కమిటీ
- దీర్ఘకాలంగా నలుగుతున్న అంశం ఇది
పాత వివాదం..
కాశీ అతి ప్రాచీన పట్టణం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. హిందువులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. అక్కడి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మసీదు ఉంది. నిజానికి అది కూడా కాశీ విశ్వనాథుని ఆలయానికి సంబంధించినదేనన్న వాదన ఉంది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదేశాల మేరకు కాశీ విశ్వనాథుని ఆలయం కొంత భాగాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించినట్టు అర్చకులు 1991లోనే వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్లు వేశారు.
మొత్తం జ్ఞానవాపి మసీదు అంతటా ఆర్కియోలాజికాల్ సర్వే కోసం ఆదేశించాలని కోరారు. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో హిందు దేవతల ఆరాధనకు అనుమతించాలని కోరారు. మసీదులో సర్వే పట్ల స్టే విధిస్తూ 2021 సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త వివాదం
జ్ఞానవాపి - శృంగార్ గౌరి కాంప్లెక్స్ ఆవరణలో శృంగార గౌరి, ఇతర దేవతలను రోజువారీగా అర్చించేందుకు అనుమతించాలనే డిమాండ్ మొదలైంది. ఢిల్లీకి చెందిన రాఖి సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు ఇతరులు 2021 ఏప్రిల్ 18న వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అడ్వకేట్ కమిషనర్, ఇతర న్యాయవాదుల బృందం ఆధ్వర్యంలో సర్వేకు, వీడియో చిత్రీకరణకు సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఆలయానికి సంబంధించిన ఆధారాలు
కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదులు, అడ్వొకేట్ కమిషనర్ మసీదు ఆవరణను పరిశీలించారు. మసీదు లోపలికి వెళ్లేందుకు వారిని అనుమతించలేదు. ఈ సందర్భంగా మసీదు గోడల బయటివైపు ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు వెలుగు చూశాయి. విగ్రహాల యొక్క అవశేషాలు, చెక్కిన హిందూ దేవతల విగ్రహాల మాదిరి రాళ్లను గుర్తించారు. దీంతో హిందూ ఆలయ నమూనాలను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందని, సీనియర్ అడ్వొకేట్ హరిశంకర్ జైన్ ఆరోపిస్తున్నారు.
మసీదు కమిటీ ఏం చెబుతోంది?
మసీదు నిర్వహణ కమిటీ మసీదు లోపల వీడియో తీయడానికి అనుమతించలేదు. ఇందుకు కోర్టు ఆదేశాలు లేవని చెబుతోంది. మసీదు పశ్చిమ గోడ అవతలి వైపు శృంగార్ గౌరీ దేవి ఉందని పేర్కొంది. పిటిషన్ వేసిన ఐదుగురిలో రాఖీ సింగ్ అనే మహిళ తన పిటిషన్ ను వెనక్కి తీసుకోనుంది.