Pawan Kalyan: డ్రైవర్ అతివేగం వల్లనే హసన్ పల్లి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది: పవన్ కల్యాణ్
- కామారెడ్డి జిల్లాలో దుర్ఘటన
- లారీని ఢీకొట్టిన టాటా ఏస్
- 9 మంది దుర్మరణం
- ఈ ఘటన బాధాకరమన్న పవన్ కల్యాణ్
కామారెడ్డి జిల్లాలో టాటా ఏస్ వాహనం లారీని ఢీకొట్టిన ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కామారెడ్డి జిల్లాలో 9 మంది చనిపోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. డ్రైవర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. వాహనాల వేగం అదుపునకు రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లాలో నిన్న నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గేటు వద్ద అతి వేగంగా వస్తున్న టాటా ఏస్... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం తెలిసిందే. కాగా, టాటా ఏస్ విపరీతమైన వేగంతో వస్తుండడాన్ని గమనించిన లారీ డ్రైవర్ రోడ్డు కిందకు దూసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.