Elon Musk: "ఒకవేళ నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే..." అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్
- ఉక్రెయిన్ లో రష్యా భీకర దాడులు
- ఉక్రెయిన్ కు మద్దతుగా ఎలాన్ మస్క్
- స్టార్ లింక్ పరికరాలు పంపిన వైనం
- మస్క్ ను హెచ్చరించిన రష్యా అధికారి
- స్పందించిన మస్క్
ఇటీవలే ట్విట్టర్ ను చేజిక్కించుకుని మాంచి ఊపుమీదున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ అందరూ అదిరిపడే ట్వీట్ చేశారు. ఒకవేళ నేను మరణిస్తే అంటూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ అయన ఏమని ట్వీట్ చేశారంటే... "ఒకవేళ నేను అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా, మీరందరూ నాకు తెలిసివున్నందుకు సంతోషంగా వుంది" అని పేర్కొన్నారు.
అయితే, ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ చేయడం వెనుక భారీ నేపథ్యమే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ తమ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ స్టార్ లింక్ పరికరాలను పెద్ద ఎత్తున పంపించారు. ఈ స్టార్ లింక్ వ్యవస్థల సాయంతోనే ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా యుద్ధ ట్యాంకులను గురితప్పకుండా పేల్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ రష్యా అధికారి ఎలాన్ మస్క్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు.
ఉక్రెయిన్ లో ఫాసిస్టు దళాలు రావడం, ఉక్రెయిన్ కు కమ్యూనికేషన్ సామగ్రి పంపడం వంటి చర్యల్లో మీ భాగస్వామ్యం ఉందని మాకు తెలుసు... అందుకు మూల్యం చెల్లిస్తారు అంటూ ఆ అధికారి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను కూడా ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ హెచ్చరిక నేపథ్యంలోనే మస్క్ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.