Janasena: ఈ కేటాయింపులు వైసీపీ వాళ్ల కమీషన్లకే సరిపోవు: జనసేన నేత నాదెండ్ల మనోహర్
- పల్లెల్లో రోడ్లకు రూ.300 కోట్లు కావాలన్న నాదెండ్ల
- కానీ ప్రభుత్వం కేటాయించింది రూ.26.6 కోట్లేనాని వెల్లడి
- రోడ్లు వేయలేని వాళ్లా రాజధానులు కట్టేది అన్న నాదెండ్ల
ఏపీలో రహదారుల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం తదితరాలకు వైసీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు వైసీపీ నేతల కమీషన్లకే సరిపోవన్న ఆయన... ఇక రోడ్లేం వేస్తారంటూ సెటైర్లు సంధించారు.
ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. పల్లెలకు రోడ్లు వేయాలంటే రూ.300 కోట్లు కావాలన్న నాదెండ్ల.. ప్రభుత్వం ఇచ్చింది మాత్రం రూ.26.6 కోట్లేనన్నారు. రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం కేటాయించింది రూ.9 కోట్లేనని ఆయన తెలిపారు. ఈ కేటాయింపులు వైసీపీ వాళ్ల కమీషన్లకే సరిపోవన్న నాదెండ్ల.. ఇంకేం రోడ్లు వేస్తారంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు వేయలేని వాళ్లా రాజధానులు కట్టేది? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.