Bengaluru: చనిపోవాలనుకున్న బాలుడిని.. అలా మరణమే వెతుక్కుంటూ వచ్చింది!
- చనిపోవాలని ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడు
- ఖాళీగా ఉన్న ట్రక్ ఎక్కి నిద్రపోయిన వైనం
- అది గమనించని ట్రక్ సిబ్బంది
- ఇసుకను లోడ్ చేసి తీసుకెళ్లిన వైనం
- సజీవ సమాధి అయిన బాలుడు
18 ఏళ్ల బాలుడు తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి పెట్టి, ఇల్లు వీడాడు. కానీ, అతడు ప్రాణాలు తీసుకోలేదు. విధి అతడి ప్రాణాలను బలిగొంది. బెంగళూరులో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హోస్కేట్ టౌన్ ఖాట్మండు లేఅవుట్ నివాసి అయిన సోమనాథ్ చదువుల్లో మెరికల్లాంటి విద్యార్థి. ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. తన సహచర విద్యార్థులతో అతడికి గొడవ జరిగింది. చిన్న విషయానికే చంపుతామని స్నేహితులు అతడ్ని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సోమనాథ్ ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.
స్నేహితులు తనను చంపుతామని బెదిరించారని.. అందుకని తానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఒక లేఖ రాసి పెట్టాడు. తన స్నేహితులను ఏమీ అనొద్దని కోరాడు. అతడి తండ్రి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో వుడ్ వర్క్ చేస్తుంటాడు. శనివారం ఉదయం మరతహళ్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు.. ఇసుకను ట్రక్ నుంచి అన్ లోడ్ చేస్తుండగా సోమనాథ్ శవం బయటపడింది. అతడి జేబులోని మాస్క్ ఆధారంగా పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
పోస్ట్ మార్టమ్ చేసిన వైద్యులు సోమనాథ్ ఊపిరితిత్తుల్లో ఇసుక రేణువులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇంటి నుంచి వచ్చిన సోమనాథ్ ఖాళీ ట్రక్ పైకి ఎక్కి పడుకుని ఉంటాడని.. అతడ్ని చూడని సిబ్బంది అందులో ఇసుకను లోడ్ చేయించుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.