Andhra Pradesh: తప్పు చేస్తే వదిలేది లేదు.. నారాయణ అరెస్ట్ పై మంత్రి బొత్స
- తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటూ బొత్స సూచన
- ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామని వెల్లడి
- ఎక్కడ లీకైందో తేల్చేందుకు విచారణ జరుగుతోందన్న మంత్రి
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎవరున్నా అరెస్ట్ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో అధికారులు విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటిదాకా 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ డిజైన్ లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.