P Narayana: నారాయణ అరెస్ట్‌పై చిత్తూరు జిల్లా ఎస్పీ చెప్పిన వివరాలు ఇవే!
- గత నెల 27న చిత్తూరు వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైందన్న ఎస్పీ
- పక్కా ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశామని వ్యాఖ్య
- నారాయణ భార్యను అరెస్ట్ చేయలేదని వివరణ
- విద్యా సంస్థల చైర్మన్‌గా నారాయణ ఉన్నారా? లేదా? అన్నది విచారణలో తేలుతుందని వెల్లడి
- దోషిగా తేలితే నారాయణకు పదేళ్ల జైలు తప్పదన్న ఎస్పీ
నారాయణ విద్యా సంస్థల చైర్ పర్సన్ హోదాలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల చైర్ పర్సన్‌గా నారాయణ కొనసాగుతున్నారా? ఇప్పటికే తప్పుకున్నారా? అన్న దానిపై తదుపరి విచారణలో నిగ్గు తేలుస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు నారాయణ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల్లో భాగంగా గత నెల 27న జరిగిన తెలుగు పరీక్ష సందర్భంగా ప్రశ్నా పత్రాన్ని ముందుగానే బయటకు తెచ్చిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు.. కాసేపట్లోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసి పరీక్షా కేంద్రానికి పంపే యత్నం చేశారని ఎస్పీ తెలిపారు.
అయితే అప్పటికే తాము ఈ యత్నాన్ని అడ్డుకున్నామని తెలిపారు. తమ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు మంచి మార్కులు రావాలన్న ఉద్దేశ్యంతోనే నారాయణ విద్యా సంస్థలు ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆయన వివరించారు. గత 27న చిత్తూరు వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు కాగా... ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామన్న ఎస్పీ.. తాజాగా నారాయణతో పాటు.. చిత్తూరు డీన్ బాల గంగాధర్‌ను కూడా అరెస్ట్ చేశామన్నారు.
అరెస్ట్ సందర్భంగా నారాయణ పోలీసులకు పూర్తిగా సహకరించారని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ సందర్భంగా ఆయన పారిపోయేందుకు యత్నించారన్న వార్తలపై స్పందిస్తూ, అలాంటిదేమీ లేదన్నారు. అంతేకాకుండా నారాయణను మాత్రమే తాము అరెస్ట్ చేశామని, నారాయణ భార్యను అరెస్ట్ చేయలేదని తెలిపారు. మరి కాసేపట్లో నారాయణను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో పక్కా ఆధారాలు లభించిన నేపథ్యంలోనే నారాయణను అరెస్ట్ చేశామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఆర్గనైజ్డ్ మెకానిజం (వ్యవస్థీకృత యంత్రాంగం) ద్వారా నారాయణ విద్యా సంస్థలు మాల్ ప్రాక్టీస్‌కు గతంలో పాల్పడ్డాయని, అయితే ఈ దఫా తమ నిఘాతో వారి ఆటలు సాగలేదని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇతర విద్యా సంస్థలకు చెందిన వారి పాత్ర కూడా ఉందని, అయితే వారంతా కూడా గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వారుగానే తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నారాయణ తప్పు చేశారని తేలితే... పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని ఆయన చెప్పారు.