Andhra Pradesh: ప్రభుత్వాసుపత్రిలో రెస్ట్ తీసుకున్న డాక్టర్.. చికిత్స చేసిన సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు.. యాక్సిడెంట్ బాధితుడి మృతి
- నిన్న అనంతసాగరం వద్ద బైక్ యాక్సిడెంట్
- రామకృష్ణ, చిరంజీవి అనే వ్యక్తులకు గాయాలు
- ఆత్మకూరు ఆసుపత్రికి తరలింపు
- ఇంజెక్షన్ ఇచ్చి ఊరుకున్న డాక్టర్
- కట్లు కట్టి, సెలైన్లు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలైన బాధితుడికి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేశారు. ప్రథమచికిత్స చేసి, కట్లు కట్టి, మందులివ్వాల్సిన డాక్టరు.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి తాపీగా వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ఆ బాధితుడు మరణించాడు.
నిన్న అనంతసాగరం వద్ద బైకుకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తో పాటు చిరంజీవి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చిరంజీవి అనే వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు.
అయితే, రామకృష్ణకు మాత్రం డ్యూటీ డాక్టర్ చికిత్స చేయలేదు. కట్టు కట్టడం దగ్గర్నుంచి సెలైన్ బాటిళ్లు పెట్టేదాకా అంతా సెక్యూరిటీ గార్డులు, కాంపౌండర్లు, స్వీపర్లే చూసుకున్నారు. వాళ్లు రామకృష్ణ తలకు కట్టిన కట్టు కూడా ఎంతోసేపు నిలవలేదు. కాసేపటికే అది ఊడి కిందపడిపోయింది.
ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా, ఈ ఘటనపై రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ సిబ్బంది ఎక్కడకు పోయారంటూ మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు.