TDP: "రైతు కోసం తెలుగుదేశం" పేరిట కొత్త కమిటీని ప్రకటించిన టీడీపీ
- కమిటీ సభ్యులుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు దన్నుగా నిలిచేందుకే కమిటీ
- కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండు, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం
- రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న అచ్చెన్న
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అన్నదాతలకు అండగా నిలిచేందుకు ఓ కొత్త కమిటీని ప్రకటించింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందే దిశగా ఈ కమిటీ పోరాటం చేయనుంది. రైతు కోసం తెలుగుదేశం పేరిట ఈ కమిటీని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు.
ఈ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలను నియమించారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పరిహారం అందే దిశగా ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని అన్నారు. ఇక కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఆయన తెలిపారు.