Cyclone Asani: మచిలీపట్టణం-నరసాపురం మధ్య తీరం దాటిన అసని తుపాను.. వేలాది ఎకరాల్లోని పంట నాశనం!

Cyclone Asani Crossed between Machilipatnam and Narasapuram

  • బలహీన పడినా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి!
  • వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి
  • ఒక్క కృష్ణా జిల్లాలోనే 900 ఎకరాల్లో పంట నష్టం
  • నిలిచిపోయిన విమాన సర్వీసులు
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

భారీ వర్షాలు, ఈదురుగాలులతో భయోత్పాతం సృష్టించిన అసని తుపాను తీరం దాటింది. మచిలీపట్టణానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. అయితే, ఇది ఈ రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

తుపాను ప్రభావంతో మొన్న, నిన్న నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 900 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అంచనా.

తుపాను ప్రభావంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో ఉప్పాడ-కొత్తపల్లి రహదారి ధ్వంసమైంది. మొన్న ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన ఓ బార్జి ఇసుకలో కూరుకుపోయింది. ఇక, తుపాను కారణంగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

విజయవాడ కేంద్రంగా నడిచే పలు విమానాలు నిన్న రద్దయ్యాయి. రాత్రికి విజయవాడ చేరుకోవాల్సిన ఢిల్లీ, హైదరాబాద్ సర్వీసులను రద్దు చేశారు. అలాగే, ఇండిగో విమానయాన సంస్థ కూడా పలు విమానాలను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం, రాజమండ్రి-కడప లింక్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 16 సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో 22 ఇండిగో, 4 ఎయిర్ ఏషియా, 2 ఎయిర్ ఇండియా, కోల్‌కతా స్పైస్ జెట్ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.

మరోవైపు, అసని తుపాను తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.

  • Loading...

More Telugu News