Telangana: హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం
- గత రెండు మూడు రోజులతో పోలిస్తే 10 డిగ్రీల తగ్గుదల
- ధాన్యం ఆరబోసిన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలు కురిసే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 82 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెద్దబెల్లాల్ లో వడదెబ్బకు గురై ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు, అసని తుపాను కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలపై మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండుమూడు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పైగా తగ్గాయి.