Chicken: చికెన్.. మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
- చికెన్ లో బ్రెస్ట్ భాగమే మంచిది
- మిగతా అంతటా అధిక ఫ్యాట్
- మటన్ లో చాప్స్ భాగం మంచిది
- అధిక ప్రొటీన్, తక్కువ ఫ్యాట్
- పరిమితంగా తీసుకుంటేనే ప్రయోజనమంటున్న పోషకాహార నిపుణులు
చికెన్, మటన్.. ఈ రెండింటినీ ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే, కొందరికి ఈ రెండింటిలో ఏదో ఒకటి అంటేనే ఎక్కువ ప్రీతి. కొందరు మటన్ కంటే చికెన్ ఆరోగ్యానికి మంచిదన్న అభిప్రాయంతో.. చికెన్ కే ప్రాధాన్యం ఇస్తుంటారు.
కానీ, చికెన్ కంటే మటన్ చాప్స్ తో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన వారు తక్కువే. అందుకే ఈ రెండింటి విషయంలో ప్రయోజనాలు, నష్టం గురించి తెలుసుకున్న తర్వాతే తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం మంచిది. ఈ విషయాలను పోషకాహార నిపుణురాలు పూజ మల్హోత్రా వెల్లడించారు.
మేక చాప్స్ (తొడ కండ)తో కేలరీలు తక్కువగా అందుతాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. చికెన్ తో పోలిస్తే అధిక ప్రొటీన్ లభిస్తుంది. మేక చాప్స్ లో ఐరన్, పొటాషియం కూడా ఎక్కువే. చికెన్ కంటే సోడియం తక్కువ.
చికెన్ మంచిదని ఎక్కువ మంది అభిప్రాయం. కానీ, చికెన్ లో కొన్ని భాగాలే మంచివి. మిగతా అంతా కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వీటితో ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
చికెన్ లెగ్స్(కాళ్లు), వింగ్స్(రెక్కలు), తొడ భాగంలో అధిక ఫ్యాట్ ఉంటుంది. చికెన్ తినాలని అనుకునే వారు బ్రెస్ట్ (ఛాతీ కండరం) భాగానికే పరిమితం కావాలి. చేపలు, మేక చాప్స్ తోపాటు చికెన్ బ్రెస్ట్ భాగమే ఆరోగ్యపరంగా తీసుకోతగినవిగా న్యూట్రిషనిస్ట్ పూజ మల్హోత్రా సూచన. ఇవి కూడా అధిక మోతాదులో తీసుకోకుండా, పరిమితంగా ఉండాలని సూచించారు.