Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే!
- కల్లోలభరితంగా శ్రీలంక
- ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
- విక్రమసింఘేనే ప్రధాని అంటున్న సొంత పార్టీ
- ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడి
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వంటి అనుభవశాలి మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్ నేషనల్ పార్టీ చైర్మన్ వజిర అబేవర్ధనే వెల్లడించారు.
విక్రమసింఘే ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. అనేకమంది పార్లమెంటు సభ్యులు కొత్త ప్రధానిగా విక్రమసింఘేనే రావాలని కోరుకుంటున్నారని అబేవర్ధనే వివరించారు. కాగా, రణిల్ విక్రమసింఘే గతంలో ఐదు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా వ్యవహరించారు. కాగా, నూతన ప్రధాని నియామకం అంటూ వస్తున్న వార్తలపై శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నుంచి ఎలాంటి స్పందన రాలేదు.