Brahmos: "డైరెక్ట్ హిట్"... సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ను పరీక్షించిన భారత వాయుసేన
- బ్రహ్మోస్ క్షిపణి రేంజి పొడిగింపు
- గతంలో 290 కిమీ రేంజి
- ప్రస్తుతం 350 కిమీ వరకు పొడిగింపు
- అత్యంత కచ్చితత్వంతో లక్ష్యఛేదన
రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో విజయవంతం అయ్యాయి. తాజాగా, భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది. బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. "డైరెక్ట్ హిట్" అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత అభివృద్ధి చేశారు. రేంజి పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి.
గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు. తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్టయింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే.