Southwest monsoons: వాతావరణశాఖ చల్లని కబరు.. ఈ నెలలోనే నైరుతి ఆగమనం
- ఈ నెల 15న అండమాన్, నికోబార్ దీవుల్లో తొలి వర్షం
- ఈసారి తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే ఆగమనం
- జూన్ 5-8 మధ్య తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్న రుతుపవనాలు
వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్తంత ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టబోతున్నాయని తెలిపింది. అంతేకాదు అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15న తొలి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 15 నాటికి దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
మామూలుగా అయితే, ఈ నెల 15న నికోబార్ దీవులను దాటుకుని 22వ తేదీ నాటికి అండమాన్ దీవుల్లోని ఉత్తర ప్రాంతమైన మాయాబందర్ను తాకుతాయి. అయితే, ఈసారి 15 నాటికే ఇక్కడ తొలి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, ఈసారి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా అయితే, జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ 5-8 మధ్య రుతుపవనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐడీఎం పేర్కొంది.