North Korea: ఉత్తరకొరియాలో తొలి కరోనా మరణం నమోదు... 1,87,800 మందికి జ్వరం
- జ్వరంతో ఆరుగురి మృతి
- వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ
- ఐసోలేషన్‌లో 1,87,800 మంది
ఉత్తరకొరియాలో కరోనా తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరి కొంత మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఓ కరోనా బాధితుడు మృతి చెందాడని ఉత్తరకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్ లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ.2ను గుర్తించారు.
ఉత్తరకొరియాలో ప్రస్తుతం 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు వివరించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్ విధించారు. అక్కడ ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు. టీకాలు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ ఉత్తరకొరియా ఇంతకు ముందు తిరస్కరించింది.