Kishan Reddy: కేసీఆర్, కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
- కేంద్ర సర్కారు రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో ఉందన్న కిషన్ రెడ్డి
- తెలంగాణలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను తెరవలేదని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రజా సంగ్రామ యాత్రలో తాము రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను తెరవలేదని చెప్పారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి తరలించాలని ఆయన అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి, వరదలకు కొట్టుకుని పోయిందని అన్నారు. దీంతో రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు రైతులకు అనుకూలంగా ఉండాలని ఆయన హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.