New Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం.. పలువురికి తీవ్ర గాయాలు

27 Dead and 40 Hospitalised In Massive Fire At 4 Storey Building In Delhi

  • పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం
  • అగ్ని కీలల్లో చిక్కుకున్న మూడంతస్తుల భవనం
  • సీసీటీవీ, రూటర్ తయారీ కంపెనీలో తొలుత మంటలు
  • కంపెనీ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. 

భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయంలో తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు భవనం మొత్తానికి పాకాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న 60-70 మందిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

రాత్రి పది గంటల సమయంలోనూ ఇంకా కొందరు భవనంలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిటికీలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి బాధితులను రక్షించినట్టు పోలీసులు తెలిపారు. రూటర్ కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. 

ఈ ప్రమాదం చాలా విషాదకరమని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్టు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News