wheat: ధరల కట్టడికి గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం
- తక్షణమే అమల్లోకి ఆదేశాలు
- అంతర్జాతీయంగా తగ్గిన సరఫరా
- 14 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ధరలు
పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలకు సామాన్యులు సతమతం అవుతుండడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గోధుమ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఇప్పటికే ఎగుమతి కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పొందిన షిప్ మెంట్లకు మాత్రం అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలు పెట్టిన తర్వాత ఆ దేశాల నుంచి గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత గోధుమ సరఫరాలపై ఆధారపడ్డారు. దీంతో దేశీయంగా గోధుమల ధరలు పెరిగిపోయాయి. సుమారు 14-20 శాతం మేర పెరిగాయి. 14 ఏళ్ల గరిష్ఠానికి ధరలు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రధానంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల సరఫరా తగ్గి ధరలు పెరిగిపోయాయి. అదే ప్రభావం మన దేశ మార్కెట్ పైనా పడింది. దీనికితోడు రవాణా వ్యయాలు పెరిగిపోవడం, ఇథనాల్ తయారీలో గోధుమలను వినియోగించడం ధరల మంటలకు కారణమవుతున్నాయి. దీంతో ధరలను అదుపు చేసేందుకు ఎగుమతులను కేంద్రం నిషేధించింది.