USA: న్యూయార్క్ సూపర్ మార్కెట్‌లో మాస్ షూటింగ్.. 10మంది మృతి
- హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ద్వారా కాల్పుల ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఆగంతకుడు
- జాతి విద్వేషమే కారణమని అనుమానం
- ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు
- పోలీసుల అదుపులో నిందితుడు
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. పదిమందిని పొట్టనపెట్టుకుంది. మిలటరీ దుస్తులు ధరించిన ఆగంతకుడు నిన్న మధ్యాహ్నం న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో ఉన్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
కాల్పుల ఘటనను నిందితుడు తన హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సూపర్ మార్కెట్‌లోకి చొరబడి కాల్పులు జరిపిన నిందితుడు వెళ్తూవెళ్తూ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వారిపైనా కాల్పులు జరిపినట్టు హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
నిందితుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి లోపలున్న వారిపై కాల్పులు జరుపుతున్నట్టు కూడా అందులో రికార్డైంది. ఇటీవల పదవీ విరమణ పొందిన ఓ పోలీసులు అధికారి ఇటీవలే ఆ సూపర్ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరారు. తాజా కాల్పుల్లో ఆయన కూడా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల వెనకున్న లక్ష్యం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల వెనక జాతివివక్ష కోణంపైనా దర్యాప్తు జరుగుతోందని అన్నారు. కాగా, నల్లజాతీయులు ఎక్కువగా నివసించే చోట ఈ ఘటన జరగడంతో జాతి విద్వేషమే కాల్పులకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.