Bollywood: రెండోసారి కరోనా బారినపడిన బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్

Akshay Kumar Covid positive a second time
  • గతేడాది ఏప్రిల్‌లో కరోనా బారిన అక్షయ్
  • కోలుకుని మళ్లీ మీ ముందుకు వస్తానని ట్వీట్
  • ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడి
  • కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరం
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. కొవిడ్ సోకడంతో ఈ నెల 17న ప్రారంభం కానున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్వీట్ చేస్తూ.. కేన్స్ 2022 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తనకు కరోనా సోకిందని, దీంతో విశ్రాంతి తీసుకుంటున్నానని రాసుకొచ్చాడు. కేన్స్‌ను తాను నిజంగా మిస్సవుతున్నట్టు పేర్కొన్న అక్షయ్.. కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. 

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్, ఆర్. మాధవన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, నయనతార, తమన్నా భాటియా, శేఖర్ కపూర్, సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్ జోషి, రిక్కీ కేజ్, ఇతరులతో కలిసి అక్షయ్ కుమార్ రెడ్ కార్పెట్‌పై నడవబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు కరోనా సోకడంతో కేన్స్‌కు దూరమయ్యాడు.

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలో యష్ రాజ్ ఫిల్మ్స్ పిరియడ్ డ్రామ్ ‘పృథ్వీరాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో అక్షయ్ తొలిసారి కరోనా బారినపడ్డాడు. ఈ ఉదయం తనకు కరోనా సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని పేర్కొన్న అక్షయ్.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పాడు. క్వారంటైన్‌లో ఉన్న తాను అవసరమైన చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇటీవల తనను కలిసిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని పేర్కొన్నాడు. ఆ తర్వాత.. తాను ఆసుపత్రిలో చేరిన విషయాన్ని వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
Bollywood
Akshay Kumar
Corona Virus
Covid Positive

More Telugu News