Shreyas Iyer: కోల్ కతా నైట్ రైడర్స్ సీఈవో విషయంలో మారిన అయ్యర్ మాట
- సీఈవో అక్కడ ఉంటారన్నది ఆటగాళ్లను ఓదార్చేందుకే
- తాజాగా ప్రకటించిన శ్రేయాస్ అయ్యర్
- పెద్ద ఎత్తున విమర్శలతో మారిన స్వరం
‘మా జట్టు ఎంపికలో సీఈవో సైతం పాలుపంచుకుంటారు’ కొన్ని రోజుల క్రితం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వయంగా చెప్పిన మాట. తర్వాత దీనిపై వచ్చిన విమర్శలతో అయ్యర్ మాట మార్చాడు. శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కేకేఆర్ 54 పరుగుల ఆధిక్యంతో చక్కటి విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అయ్యర్ మీడియాతో మాట్లాడాడు.
‘‘నా చివరి ఇంటర్వ్యూ సందర్భంగా సీఈవో పేరును ప్రస్తావించడంపై నేను స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. సీఈవో కూడా అక్కడే ఉంటారని నేను చెప్పడం వెనుక.. ఎంపిక కాని ఆటగాళ్లను ఒదార్చేందుకే అని నా ఉద్దేశ్యం. వారికి అది అంత సులభం కాదు’’అంటూ అయ్యర్ ప్రకటన చేశాడు. జట్టు ఎంపిక అన్నది కోచ్, కెప్టెన్ కలిసి చేసేది కదా.. సీఈవో జోక్యం ఏంటంటూ అయ్యర్ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయ్యర్ చెప్పిన విషయాలు వింటే షాకింగ్ గా ఉన్నాయని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్ సైతం వ్యాఖ్యానించారు. ట్విట్టర్ లోనూ యూజర్లు విమర్శలు కురిపించారు. దీంతో అయ్యర్ తన వ్యాఖ్యలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది.