Maharashtra: మేము కూడా అలా చేస్తే పారిపోయేందుకు చోటు ఉండదు: బీజేపీకి సేన హెచ్చరిక
- కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపాలి
- లేదంటే తాము నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాల్సి వస్తుంది
- బీజేపీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిక
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే మరోసారి మాటలతో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర వికాస్ అగాఢీ (ఎంవీఏ) నేతలపై బోగస్ కేసుల కోసం దర్యాప్తు విభాగాలైన సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేయడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే నిలిపివేయాలని కోరారు. లేదంటే తన ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
‘‘బీజేపీకి వ్యతిరేకంగా మేము కూడా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తే వారు పారిపోయేందుకు చోటు కూడా ఉండదు’’ అంటూ బీకేసీలో ర్యాలీ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే కఠిన హెచ్చరిక జారీ చేశారు. కశ్మీర్ లో పండిట్లకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. దీనికి బదులు కేంద్ర సర్కారు మహారాష్ట్రలో చిన్న పాటి బీజేపీ నేతలకు రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్, తన సోదరుడు రాజ్ థాకరేను ఉద్దేశిస్తూ ఉద్దవ్ థాకరే పరోక్ష విమర్శలు చేశారు. శాఫ్రాన్ శాలువా ధరించి బాలాసాహెబ్ థాకరే (బాల్ థాకరే) అని కొందరు అనుకుంటున్నారని.. అలాంటి వారి మెదళ్లలో మున్నాభాయ్ మాదిరి రసాయనం లోపించిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత శివసేన నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం గమనార్హం.