IPL 2022: ఓ మోస్తరు స్కోరు చేసిన రాజస్థాన్... లక్నో లక్ష్యం 179 పరుగులు
- 20 ఓవర్లలో 178 పరుగులు చేసిన రాజస్థాన్
- ఆదిలోనే బట్లర్ వికెట్ కోల్పోయిన శాంసన్ సేన
- వికెట్లు తీసినా... భారీగా పరుగులు ఇచ్చిన లక్నో బౌలర్లు
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగానే సాగిన రాజస్థాన్ రాయల్స్ ఓ మోస్తరు స్కోరును నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఆదిలోనే స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యశస్వీ జైస్వాల్ (41) సత్తా చాటాడు. బట్లర్ అవుట్‌తో అతడికి జత కూడిన కెప్టెన్ సంజూ శాంసన్ (32) దూకుడుగానే కనిపించినా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తర్వాత జైస్వాల్‌కు జత కలిసిన దేవదత్ పడిక్కల్ (39) బాగానే రాణించాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే... వరుసగా వికెట్లు తీసినా.. లక్నో బౌలర్లు పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నారు. లక్నో బౌలర్ మార్కస్ స్టోయినిస్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కగా... అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బదోనీకి తలో వికెట్ దక్కింది. మరికాసేపట్లోనే 179 పరుగుల విజయలక్ష్యంతో లక్నో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.