Telangana: కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు
- కొన్ని ప్రాంతాల్లో మండిపోనున్న ఎండలు
- కనీసం మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం
- నిన్న మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో నేడు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోయే అవకాశం ఉందని, కనీసం మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అలాగే, బీహార్ నుంచి చత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వివరించింది.
దీని ప్రభావంతో నేడు అక్కడక్కడ వర్షాలు కురవనుండగా, నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతుపవనాల కదలికలు మొదలవుతాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ తెలిపింది.