Devendra Fadnavis: ఔరంగజేబ్ సమాధిని ఒవైసీ దర్శించడంపై ఫడ్నవిస్ తీవ్ర వ్యాఖ్యలు
- ఔరంగజేబ్ సమాధి వద్ద ఒవైసీ నివాళి అర్పించడంపై ఫడ్నవిస్ ఫైర్
- ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ థాకరేపై మండిపాటు
- ఔరంగజేబ్ ను కుక్కలు కూడా గుర్తించవని వ్యాఖ్య
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంపైనా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపైనా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు. మహారాష్ట్రను పాలిస్తున్న సంకీర్ణ ప్రభుత్వం బాబ్రీ మసీదు వంటి ఒక నిర్మాణమని ఆయన విమర్శించారు. ఆ నిర్మాణాన్ని (సంకీర్ణ ప్రభుత్వాన్ని) కూల్చేంత వరకు తాను విశ్రమించబోనని చెప్పారు. ముంబైలో నిన్న బీజేపీ నిర్వహించిన మహా సంకల్ప్ సభలో పార్టీ శ్రేణులతో కలసి ఆయన హనుమాన్ చాలీసా పఠించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము హనుమాన్ చాలీసాను పఠించామని ఫడ్నవిస్ అన్నారు. తన కుమారుడి పాలనలో హనుమాన్ చాలీసాను పఠించడం రాజద్రోహం అవుతుందని దివంగత బాలాసాహెబ్ థాకరే ఎప్పుడైనా ఊహించారా? అని ప్రశ్నించారు. ఔరంగజేబ్ సమాధిని దర్శించుకోవడం రాచ మర్యాద అవుతుందని భావించారా? అని అడిగారు.
నిన్న శివసేన నిర్వహంచింది కౌరవ సభ అయితే... ఈరోజు తాము నిర్వహించింది పాండవ సభ అని ఫడ్నవిస్ అన్నారు. ఉద్ధవ్ థాకరే నిర్వహించిన ర్యాలీ ఒక నవ్వుల కార్యక్రమంలా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి ఫడ్నవిస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లి ఒవైసీ నివాళి అర్పించారని... ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని ఉద్ధవ్ థాకరేని ప్రశ్నించారు. 'ఒవైసీ.. నేను చెప్పేది వినండి. ఔరంగజేబ్ ను కుక్కలు కూడా గుర్తించవు. ఆయన గుర్తింపుపై కనీసం మూత్ర విసర్జన కూడా చేయవు. ఈ దేశాన్ని కాషాయం పాలిస్తుంది' అని వ్యాఖ్యానించారు.