Narendra Modi: నేపాల్ కు బయల్దేరిన మోదీ.. బుద్ధుని బోధనలు ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాయన్న ప్రధాని! 

Modi leaves to Nepal

  • బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ కు పయనం
  • లుంబినీలో బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్న మోదీ
  • అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు

భారత ప్రధాని మోదీ నేపాల్ కు బయల్దేరారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ కు ఆయన బయల్దేరారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుశినగర్ లో గౌతమ బుద్ధుడు మోక్షం పొందాడని ప్రతీతి. ఇక్కడ ప్రార్థనలను నిర్వహించిన తర్వాత ఆయన నేపాల్ లోని లుంబినీకి వెళ్తారు. లుంబినీ గౌతమ బుద్ధుడి జన్మస్థలం. 

లుంబినీ డెవలప్ మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. లుంబినీలో బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి మన దేశం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో వారసత్వ కేంద్రం నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు ఇరు దేశాలకు సంబంధించి ఐదు అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. 

మరోవైపు తన పర్యటన సందర్భంగా మోదీ స్పందిస్తూ... బుద్ధుడి బోధనలు ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాయని చెప్పారు. నేపాల్ ప్రధాని ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు. ఈరోజు నేపాల్ ప్రధానితో సమావేశం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News