withdraw: కార్డు లేకుండా డబ్బు డ్రా ఎంతో సులభం!
- స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్ ఉంటే చాలు
- ఏటీఎం మెషిన్ స్క్రీన్ పై క్యూఆర్ కోడ్
- స్కాన్ చేసి, ఎంత కావాలో నమోదు చేస్తే చాలు
డెబిట్ కార్డు వెంట తీసుకెళ్లడం మర్చిపోయినా ఫర్వాలేదు. ఆ మాటకొస్తే.. అసలు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెంట డెబిట్ కార్డు ఉండాల్సిన అవసరమే లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, అందులో యూపీఐ ఆధారితంగా పనిచేసే గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే ఇలా ఏది ఉన్నా చాలు. చాలా సులభంగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ఏటీఎంలలో మార్పులు చేస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ఇటీవలే ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎంలు ఒకదానితో ఒకటి అనుసంధానమై (ఇంటర్ ఆపరేబుల్) పనిచేసే విధంగా మార్పులు చేస్తున్నట్టు ఎన్ పీసీఐ తెలిపింది. కనుక వినియోగదారులు సమీపంలోని ఏటీఎంకు వెళ్లి స్మార్ట్ ఫోన్ సాయంతోనే డబ్బులు డ్రా చేసుకోవడం వీలవుతుంది. ఈ సేవను పొందాలంటే సదరు ఏటీఎం యంత్రం యూపీఐ సర్వీస్ ను సపోర్ట్ చేస్తున్నదై ఉండాలి.
ఎటీఎం మెషిన్ లో విత్ డ్రా క్యాష్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పై యూపీఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్ లో యూపీఐ యాప్ ను తెరిచి ఏటీఎం స్క్రీన్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేయాలి. స్కాన్ పూర్తయిన తర్వాత ఎంత డ్రా చేసుకోవాలన్నది టైప్ చేయాలి. ప్రస్తుతానికి ఇది రూ.5,000 వరకు గరిష్ఠ పరిమితిగా ఉంది. అంతకుమించి డ్రా చేసుకోవడానికి లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్ ను ఎంటర్ చేయాలి. అనంతరం లావాదేవీ ప్రాసెస్ అయి నగదు మెషిన్ నుంచి బయటకు వస్తుంది.