Beetroots: రోజూ 100 గ్రాముల బీట్ రూట్.. ఆరోగ్యానికి దగ్గరి దారి!
- విటమిన్స్, మినరల్స్ పుష్కలం
- మన రోజువారీ అవసరాల్లో సగం భర్తీ
- రక్తపోటు, బ్లడ్ గ్లూకోజు అదుపులో
- ఇన్ ప్లమేషన్ ను తగ్గించే గుణాలు
ఎక్కువ మంది బీట్ రూట్ ను పెద్దగా ఇష్టపడరు. రుచి ఉండే వాటికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం అయినా కొన్నింటిని తీసుకోవాల్సిందే. ముఖ్యంగా కూరగాయల్లో బీట్ రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు. ప్రతి ఒక్కరూ రోజూ బీట్ రూట్ ను తీసుకోవాలి.
విటమిన్లు, మిరల్స్ పుష్కలం
బీట్ రూట్ లో కేలరీలు తక్కువ. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. మన శరీరానికి అవసరమయ్యే వాటిల్లో చాలా వరకు బీట్ రూట్ భర్తీ చేస్తుంది. 100 గ్రాముల ఉడికించిన బీట్ రూట్ తో వచ్చే కేలరీలు 44 మాత్రమే. ప్రొటీన్ 1.7 గ్రాములు, ఫ్యాట్ 0.20 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు, ఫైబర్ (పీచు) 2 గ్రాములు లభిస్తాయి. ఫొలేట్ అయితే మన రోజువారీ అవసరాల్లో 20 శాతం భర్తీ అవుతుంది. అలాగే మనకు రోజువారీ కావాల్సిన పరిణామంలో మాంగనీస్ 14 శాతం, కాపర్ 8 శాతం, పొటాషియం 7 శాతం, మెగ్నీషియం 6 శాతం, విటమిన్ సీ 4 శాతం, విటమిన్ బీ6 నాలుగు శాతం చొప్పున అందుతాయి.
రక్తపోటు నియంత్రణ
సిస్టాలిక్, డయాస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో బీట్ రూట్ ఎంతో సాయపడుతుందని పలు అధ్యయనాలు గుర్తించాయి. గుండెకు రక్తపోటు వల్ల అధిక రిస్క్ ఎదురవుతుంది. బీట్ రూట్స్ లో నైట్రేట్స్ అధికంగా ఉండడం వల్ల సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఇది గుండె కవాటాలు మూసుకున్నప్పుడు రక్త ప్రవాహంపై ఉండే ఒత్తిడి. గుండె కవాటాలు తెరుచుకున్నప్పుడు ఉండే రక్తపోటును డయాస్టాలిక్ బ్లడ్ ప్రజర్ గా చెబుతారు. దీనికి సంబంధించి ఉడికించిన బీట్ రూట్ కంటే పచ్చి బీట్ రూట్ మంచిదని వైద్యులు చెబుతున్నారు.
క్రీడా సామర్థ్యం పెరుగుతుంది..
బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు క్రీడాకారుల్లో సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుందని పరిశోధకులు గుర్తించారు. కణాల్లో శక్తిని తయారు చేసే మిటోచాండ్రియా సామర్థ్యాన్ని బీట్ రూట్ పెంచుతుంది.
ఇన్ ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది
బీట్ రూట్ లో బెటాలైన్స్ అనే పిగ్మెంట్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ ఫ్లమేషన్ (వాపు) గుణాలు ఉన్నాయి. దీంతో క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ఊబకాయం, గుండె జబ్బు, కాలేయ జబ్బు, కేన్సర్ లలో ఇన్ ఫ్లమేషన్ ఉంటుంది. రోజూ 250 మిల్లీ లీటర్ల బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే ఇన్ ఫ్లమేషన్ ను సూచించే సీ రియాక్టివ్ ప్రొటీన్ గణనీయంగా తగ్గుతున్నట్టు ఒక అధ్యయనంలో గుర్తించారు.
గ్లూకోజ్ తగ్గుతుంది..
బీట్ రూట్లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాదు బీట్ రూట్ లో ఉండే విటమిన్ బీ9 కణాల వృద్ధికి సాయపడుతుంది.
కేన్సర్ పై పోరులో సాయం
కేన్సర్ పై పోరాడే బెటైన్, ఫెరూలిక్ యాసిడ్, రూటిన్, కెంఫెరాల్, కెఫీయిక్ యాసిడ్ ఇందులో ఉన్నాయి. కేన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు సైతం గుర్తించారు.