Narendra Modi: భారత్-నేపాల్ సంబంధాలు హిమాలయాల్లా చెక్కుచెదరనివి: ప్రధాని మోదీ
- లుంబినిలో బౌద్ధ మత సదస్సులో పాల్గొన్న మోదీ
- దివ్యమైన అనుభూతిని కలిగిస్తోందన్న ప్రధాని
- ఇరుదేశాల మైత్రి మరింత బలోపేతమవుతోందని వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగుదేశం నేపాల్ లో పర్యటిస్తున్నారు. లుంబినిలో బౌద్ధ మత సదస్సులో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. బుద్ధ భగవానుడిపై భక్తి ఇరుదేశాలను ఒక్కతాటిపై నిలుపుతోందని, ఒకే కుటుంబంగా మలిచిందని వివరించారు. బుద్ధ భగవానుడు జన్మించిన స్థలం తనకు దివ్యమైన అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు. తాను 2014లో సమర్పించిన మహాబోధి మొక్క నేడు వృక్షంలా ఎదిగిందని పేర్కొన్నారు.
కాగా, ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలోపేతమవుతోందని అన్నారు. భారత్-నేపాల్ మధ్య సంబంధాలు హిమాలయ పర్వతాల్లా చెక్కుచెదరనివని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో యావత్ మానవాళికి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో భారత్, నేపాల్ కృషి చేస్తాయని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా లుంబినిలో ఆత్మీయ స్వాగతం పలికారు.