Congress: రాహుల్ గాంధీ పాదయాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని కోరతాం: రేవంత్ రెడ్డి
- వరంగల్ డిక్లరేషన్‌కు పార్టీ అధిష్ఠానం నుంచి మంచి స్పందన
- డిజిటల్ సభ్యత్వం కూడా గ్రాండ్ సక్సెస్
- ఇంకో ఏడాది కష్టపడితే కాంగ్రెస్‌దే అధికారమన్న రేవంత్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెంటిమెంట్‌గా యాత్రను తెలంగాణలో ప్రారంభిస్తే బాగుంటుందన్న విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుతామని తెలిపారు.
రైతు సంఘర్షణ సభ పేరిట వరంగల్ లో నిర్వహించిన రాహుల్ సభ విజయవంతమైందన్న రేవంత్ రెడ్డి... ఆ సభలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌కు పార్టీ పెద్దల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా తెలంగాణలో అంచనాలకు మించి విజయవంతం చేశామని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు కలసికట్టుగా ముందుకు సాగిన నేపథ్యంలోనే ఇలా వరుసగా విజయాలు సాధిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదే రీతిన ఇంకో ఏడాది మాత్రమే కష్టపడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.