Russia: యుద్ధంలో భారీగా నష్టపోతున్న రష్యా.. ఉక్రెయిన్‌కు లొంగిపోతున్న రష్యా సైనికులు!
- రష్యా తన సైన్యంలో మూడింట ఒకవంతు నష్టపోయిందన్న యూకే
- తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా పాచికలు పారడం లేదంటూ ట్వీట్
- ఆక్రమణ చర్యలను వేగవంతం చేయలేని పరిస్థితుల్లో రష్యా ఉందన్న యూకే
- శత్రుదేశ సరిహద్దులకు ఉక్రెయిన్ సైన్యం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నెలలు దాటిపోతోంది. అయినప్పటికీ ఆ చిన్న దేశాన్ని లొంగదీసుకోవడంలో విఫలమవుతోంది. రష్యా సేనలను సమర్థంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ క్రమంగా పట్టుసాధిస్తూ రష్యాకు సవాలు విసురుతోంది. ఇరువైపులా భారీగా నష్టం సంభవిస్తున్నప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై యూకే తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యన్ సైన్యం క్రమంగా బలహీనపడుతోంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు రష్యా తన సైన్యంలో మూడింట ఒకవంతు నష్టాన్ని చవిచూసింది. తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా పట్టుకోల్పోయింది. రష్యా పాచికలు అక్కడ ఏమాత్రం పారడం లేదని యూకే రక్షణ మంత్రిత్వశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.
యుద్ధంలో కోల్పోతున్న సైన్యాన్ని వెంటనే భర్తీ చేయడంలో రష్యా విఫలమవుతోందని, ఫలితంగా ఉక్రెయిన్‌లో ఆ దేశ బలగాల శక్తిసామర్థ్యాలు క్రమేణా క్షీణిస్తున్నాయని తెలిపింది. అనుకున్న ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగకపోవడంతో రష్యా సైనికులు లొంగిపోతున్నారని పేర్కొంది. అంతేకాదు, వచ్చే నెల రోజుల్లోనూ రష్యా పరిస్థితి ఇంతేనని, ఆక్రమణ చర్యలను రష్యా వేగవంతం చేసే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొంది.
మరోవైపు, ఖార్కివ్ ప్రాంతంలోని తమ దేశ సైన్యం రష్యా సరిహద్దుల వరకు వెళ్లిందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు వాదిమ్ డెనిసెంకో తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ కూడా ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్టే పెట్టింది. ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ 127 బ్రిగేడ్ బెటాలియన్ రష్యా సరిహద్దుకు చేరుకుందని, తాము విజయానికి చేరువలో ఉన్నామని ఆ పోస్టులో పేర్కొంది. ఆస్ట్రియా మాజీ రాయబారి అలెగ్జాండర్ చెర్బా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఉక్రెయిన్ సైన్యం రష్యా సరిహద్దుకు చేరుకున్నట్టుగా ఉంది. ఆ వీడియోలో సైనికులు మాట్లాడుతూ.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. శత్రుదేశ సరిహద్దులకు వచ్చేశాం’ అని పేర్కొన్నారు.