Uttar Pradesh: బాలికను లైంగికంగా వేధించిన 81 ఏళ్ల వృద్ధుడు.. ‘డిజిటల్ రేప్’ కేసు నమోదు చేసిన పోలీసులు
- యూపీలో ఈ తరహా కేసు ఇది రెండోసారి
- 17 ఏళ్ల బాలికపై ఏడేళ్లుగా లైంగిక వేధింపులు
- డిజిటల్, రేప్ పదాల కలయిక ద్వారా ఏర్పడిందే ‘డిజిటల్ రేప్’
బాలికను లైంగికంగా వేధించిన 81 ఏళ్ల వృద్ధుడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ‘డిజిటల్ రేప్’ కేసు నమోదు చేశారు. యూపీలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. అలహాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు మౌరిస్ రౌడర్ నోయిడాలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ తన స్నేహితురాలితో కలిసి ఉంటున్నాడు. ఇంట్లో పనిచేసేందుకు పెట్టుకున్న 17 ఏళ్ల బాలికను మౌరిస్ ఏడేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని బాధిత బాలిక తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను పనిలో చేరినప్పటి నుంచి మౌరిస్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత బాలిక పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డులను సాక్ష్యాలుగా అందజేసింది. నిందితుడిపై ‘డిజిటల్ రేప్’ అభియోగాలు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి జననాంగంలోకి చేతివేళ్లు, కాలి వేళ్లు, లేదంటే వస్తువులను చొప్పించడం వంటి చర్యలను డిజిటల్ రేప్‌గా పరిగణిస్తారు. డిజిట్, రేప్ అనే రెండు పదాలను కలిపి ‘డిజిటల్ రేప్’ పేరు పెట్టారు. డిసెంబరు 2012 వరకు డిజిటల్ రేప్‌ను అత్యాచారంగా పరిగణించేవారు కాదు. ‘నిర్భయ’ ఘటన తర్వాత డిజిటల్ రేప్‌ను కూడా అత్యాచారంగా పరిగణిస్తున్నారు.