Gavaskar: ఈ యువ ఆటగాడి క్రికెటింగ్ బుర్ర అమోఘం: గవాస్కర్

Gavaskar appreciates Tilak Varma have a cricketing brain
  • ఐపీఎల్ లో రాణిస్తున్న తిలక్ వర్మ
  • ముంబయి జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఎదిగిన వైనం
  • 12 మ్యాచ్ ల్లో 368 పరుగులు
  • టీమిండియాకు ఆడే సత్తా ఉందన్న రోహిత్ శర్మ
  • ఏకీభవించిన గవాస్కర్  
క్రికెట్ ప్రపంచంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుంది. తాజాగా ఆయన ఓ యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముంబయి ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ క్రికెటింగ్ బుర్ర అమోఘం అని పేర్కొన్నారు. తిలక్ వర్మ ఆలోచనా తీరు, స్వభావం అద్భుతమని కొనియాడారు. చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ తనను విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. ఎంతో ఒత్తిడిలో సైతం నిబ్బరంగా ఆడాడని ప్రశంసించారు. 

"విస్తృత స్థాయిలో షాట్లు ఆడే తిలక్ వర్మ తన ఇన్నింగ్స్ ఆరంభంలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అతడిలో క్రికెటింగ్ తెలివి పుష్కలంగా ఉందని చెప్పడానికి అది చాలు. ఓ క్రికెటర్ కు అలాంటి ఆలోచనా తీరు అత్యంత ముఖ్యం. ఒత్తిడిలోనూ బుర్ర పనిచేయించగలిగే క్రికెటర్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకుని రాణిస్తాడు. ఎప్పటికప్పుడు తనను తాను విశ్లేషించుకుంటూ, స్కోరు బోర్డును పరుగులు తీయిస్తాడు" అంటూ గవాస్కర్ వివరించారు. 

తిలక్ వర్మ ఆటను పరిశీలిస్తే, ప్రాథమిక సూత్రాలను సరిగ్గా పాటిస్తున్నాడని, సాంకేతికంగానూ ఉన్నతశ్రేణికి చెందుతాడని వివరించారు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేస్తూ, బ్యాట్ తో నేరుగా ఎదుర్కొంటున్నాడని తెలిపారు. డిఫెన్స్ ఆడే సమయంలోనూ తన బ్యాట్, ప్యాడ్ మధ్య ఖాళీ ఏర్పడకుండా జాగ్రత్తపడుతున్నాడని గవాస్కర్ విశ్లేషించారు. మూలాలకు కట్టుబడి ఆడాలన్న స్పృహ అతడిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. 

ఐపీఎల్ తాజా సీజన్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో తిలక్ వర్మ ఒకడు. ఇప్పటిదాకా 12 మ్యాచ్ లు ఆడి 368 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ హైదరాబాద్ కు చెందిన ఎడమచేతివాటం క్రికెటర్. వయసు 19 ఏళ్లే. టీమిండియా అండర్-19 జట్టులోనూ ఆడాడు. 

ఇదే ఫామ్ కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాడు అవుతాడని తిలక్ వర్మపై ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అభిప్రాయాన్ని వెల్లడించాడు. సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తిలక్ వర్మ తన ఆటతీరులో కొద్దిగా మార్పులు చేసుకుంటే, రోహిత్ శర్మ చెప్పినట్టుగా భారత్ జాతీయజట్టులో స్థానం సంపాదించడం సులువేనని గవాస్కర్ అన్నారు.
Gavaskar
Tilak Varma
Cricketing Brain
Mumbai Indians
IPL
Team India

More Telugu News