Groom: పీకలదాకా తాగి మండపానికి వచ్చిన వరుడు.. మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేసిన బంధువులు!
- రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఘటన
- ముహూర్తం మించిపోయిన తర్వాత తీరిగ్గా మండపానికి చేరుకున్న వరుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వరుడి కుటుంబ సభ్యులు
- వారి సమక్షంలో పెళ్లి రద్దు చేసుకున్న ఇరు కుటుంబాలు
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ (First Impression Is The Best Impression) అంటారు. ఎక్కడ ఎలా ఉన్నా ఉద్యోగాలు, ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో ఈ ఇంప్రెషన్ కోల్పోతే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే తొలిసారే మెప్పించలేనివారు తర్వాత ఏం చేస్తారన్న నిర్ణయానికి అవతలివారు వచ్చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ సూత్రం ఎంత అవసరమో చెప్పే ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలనా గ్రామంలో ఈ నెల 15న జరిగింది. ఫ్రెండ్స్‌తో కలిసి తప్పతాగిన వరుడు సునీల్ ముహూర్తం మించిపోయాక తీరిగ్గా మత్తులోనే పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అతడిని చూసిన వధువు చీదరించుకుంది. అతడిని చేసుకోలేనని కరాఖండీగా తేల్చి చెప్పేసింది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటలకు పెళ్లి ముహూర్తం కావడంతో వరుడి కుటుంబ సభ్యులు ముందు రోజే గ్రామానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు బరాత్ మొదలైంది. బరాత్‌లో మిత్రులతో కలిసి తప్పతాగి చిందులేసిన వరుడు ముహూర్త సమయం దాటిపోయిన తర్వాత తీరిగ్గా మండపానికి చేరుకున్నాడు. మద్యం మత్తులో మండపానికి చేరుకున్న వరుడి వాలకం చూసిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు చీదరించుకున్నారు.
అతడిని చేసుకోబోనని వధువు తెగేసి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. మరోవైపు, వధువు కుటుంబ సభ్యులు అక్కడే బంధువుల తరపు అబ్బాయితో మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తాడో అన్న భయంతోనే పెళ్లి రద్దు చేసుకున్నట్టు వధువు తరపు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. చివరికి పోలీసుల సమక్షంలో ఇరు కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.