Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం కీలక ముందడుగు.. మరియుపోల్ హస్తగతం

Concern Grows For Ukrainian Soldiers After Surrender To Russia In Mariupol

  • మరియుపోల్‌లో లొంగిపోయిన 260 మంది ఉక్రెయిన్ సైనికులు
  • తీవ్రంగా గాయపడిన 53 మందికి వైద్య సాయం
  • వారంతా తమ హీరోలన్న జెలెన్‌స్కీ
  • వారు బతికి ఉండడం తమకు ఎంతో అవసరమని వ్యాఖ్య
  • డాన్‌బాస్‌లోని కీలక స్థావరాలపై రష్యా బాంబుల వర్షం

ఉక్రెయిన్‌తో పోరులో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రష్యా కీలక ముందడుగు వేసింది. కొరకరాని కొయ్యగా మారిన మరియుపోల్‌‌ను హస్తగతం చేసుకుంది. నగరంలోని అజోవ్‌స్తల్ ఉక్కు ఫ్యాక్టరీలోని బంకర్లలో తలదాచుకుంటూ రష్యన్ సేనలను ప్రతిఘటిస్తూ వచ్చిన ఉక్రెయిన్ సైనికుల్లో 260 మంది వరకు నిన్న రష్యా సైన్యానికి లొంగిపోయారు. వీరందరినీ తమ అధీనంలో ఉన్న ఇతర ప్రాంతాలకు రష్యా సైన్యం తరలించింది. 

అయితే, వీరిని కచ్చితంగా ఎక్కడికి తరలించిందన్నది మిస్టరీగా మారింది. రష్యన్ సేనలకు లొంగిపోయిన వారిలో అమెరికా నౌకా దళానికి చెందిన రిటైర్డ్ అడ్మిరల్ జనరల్ ఇరిక్ ఒల్సన్, బ్రిటన్‌కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్, నలుగురు నాటో సైనిక శిక్షకులు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిలో తీవ్రంగా గాయపడిన 53 మందికి వైద్య సహాయం అందిస్తున్నారు. అయితే, వీరిని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తారా? లేదా? అన్నది తెలియరాలేదు. తాజా లొంగుబాటుతో మరియుపోల్ పూర్తిగా రష్యా వశమైంది. 

ఈ ఘటనపై ఉక్రెయిన్ రక్షణ శాఖ ఉపమంత్రి హన్నా మలైర్ మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న రష్యన్ సైనికులను అప్పగించి తమ వారిని విడిపించుకుంటామని తెలిపారు. ప్రాణాలకు తెగించి పోరాడిన తమ సైనికుల్ని రక్షించి తీసుకొస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీలోని బంకర్లలో ఉంటూ వారంతా రష్యా దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టారని, అలాంటి హీరోలు ప్రాణాలతో బతికి ఉండడం తమకు ఎంతో అవసరమని, అది తమ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు, రష్యన్ సేనలు డాన్‌బాస్‌లోని కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 20మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పోలండ్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న యవొరివ్ జిల్లాలోని సైనిక శిబిరంపైనా రష్యా దాడికి దిగింది.

  • Loading...

More Telugu News