Rain: రాత్రంతా దంచికొట్టిన వాన.. బెంగళూరులో ఇళ్లు, అపార్ట్ మెంట్లలోకి వరద.. ఇవిగో వీడియోలు
- 11.4 సెంటీమీటర్ల వర్షపాతం
- పొంగుతున్న చెరువులు
- రోడ్ల మీద 4 అడుగుల మేర వరద
- వాన నీటి డ్రెయిన్లు ఉప్పొంగుతున్న వైనం
కర్ణాటక రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాత్రంతా కురిసిన వర్షానికి నగరమంతా మునిగిపోయింది. కొన్ని చోట్ల 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. వర్షాలకు ఇద్దరు వలస కూలీలు చనిపోయారు.
12 గంటల్లోనే 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కర్ణాటక విపత్తు పర్యవేక్షణ కేంద్రం లెక్కల ప్రకారం అత్యధికంగా హోరమావు ప్రాంతంలో 15.5 సెంటీమీటర్ల వర్షం పడింది. వరద నీటి డ్రెయిన్లు కూడా వరదను ఆపలేకపోయాయి. నగరంలోని అన్ని డ్రెయిన్లు ఓవర్ ఫ్లో అవుతున్నాయి. ఫలితంగా నగరం మొత్తం వరదమయమైంది.
దీంతో నిన్న రాత్రి వెళ్లే మార్గం లేక, ఎక్కడి వాహనాలను అక్కడే వదిలేసి వాహనదారులు వరదల్లో నడుచుకుంటూనే ఇంటి బాట పట్టారు. ఆర్ఆర్ నగర్, కోరమంగళం, హాస్కరహళ్లి, హోరమావు, హెచ్బీఆర లే అవుట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలన్నీ వరద నీటిలో కూరుకుపోయాయి. అపార్ట్ మెంట్ కాంప్లెక్సులు, ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వెంచర్లలోని లే అవుట్లకు నష్టం వాటిల్లింది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద హునసమరణహళ్లి చెరువు పొంగి ఎన్హెచ్ 4 మునిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, వర్షం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఏటా తమకు ఇదే జరుగుతోందని మండిపడుతున్నారు.