Yogi: యూపీలో మదర్సాలకు షాక్ ఇచ్చిన యోగి సర్కారు
- కొత్త మదర్సాలకు నిధుల సాయం మినహాయింపు
- రాష్ట్రవ్యాప్తంగా 16,000 మదర్సాలు
- నిధుల సాయం 558 మదర్సాలకే పరిమితం
ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ఎటువంటి నిధులు ఇవ్వకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని మెజారిటీ మదర్సాలకు ప్రభుత్వం నుంచి రూపాయి అందదు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు.
యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,000 మదర్సాలు ఉంటాయి. కానీ, 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం ఉండదు.
మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే యూపీ సర్కారు తప్పనిసరి చేసింది. తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసింది. వారం వ్యవధిలోనే కొత్త మదర్సాలను నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.