Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోసం నారాయణ కుమార్తెలు, అల్లుడి పిటిషన్లు... రేపు హైకోర్టు నిర్ణయం
- హైకోర్టును ఆశ్రయించిన శరణి, సింధూరి, పునీత్
- మూడు రోజుల క్రితం హౌజ్ మోషన్ పిటిషన్లు దాఖలు
- వాదనలు పూర్తి... తీర్పు రేపటికి వాయిదా
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు శరణి, సింధూరిలతో పాటు ఆయన అల్లుడు పునీత్ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ వారు మూడు రోజుల క్రితం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు... నిందితులపై ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగరాదంటూ హైకోర్టు ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే... ఈ పిటిషన్ల విచారణలో భాగంగా నిందితుల తరఫు న్యాయావాది వాదనలతో పాటు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు బుధవారం పూర్తయ్యాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్లపై తన నిర్ణయాన్ని రేపు (గురువారం) వెల్లడిస్తానని తెలిపింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.