Kim Jong Un: ఉత్తరకొరియాలో దారుణ పరిస్థితులు.. కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు

Kim Slams Officials As Outbreak Surges In North Korea

  • ఉత్తరకొరియాలో రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు
  • ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, ఐరాస
  • అవసరమైన ఔషధాలు, మందులు పంపేందుకు సిద్ధమన్న టెడ్రోస్
  • రెట్టింపు వేగంతో పనిచేయాలంటూ అధికారులకు కిమ్ ఆదేశాలు

ఉత్తరకొరియాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. నార్త్ కొరియాలో లక్షలాదిమంది ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వార్తలు తాజాగా వెలుగులోకి రావడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

అక్కడి తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. కచ్చితంగా ఇది ఆందోళన కలిగించే అంశమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వాడాల్సిందేనని అన్నారు. వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఉత్తరకొరియాలో పరిస్థితులను అదుపు చేసేందుకు అవసరమైన ఔషధాలు, టీకాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. అలాగే, ఐక్యరాజ్య సమితి కూడా నార్త్ కొరియా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి ప్రజలు ఇప్పటికే కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు కొవిడ్ ఆంక్షలు మరింత భయాందోళనలలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, నిన్న ఆ దేశంలో 2.32 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఆరుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 1.7 మిలియన్లకు చేరగా, 62 మంది మృతి చెందారు. కరోనా కట్టడికి రెట్టింపు వేగంతో పనిచేయాలని దేశాధ్యక్షుడు కిమ్ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News